నిరంతరం మార్పు చెందే ఆర్థిక వ్యవస్థలపై, మార్కెట్లపై లోతైన అవగాహన విస్తృతమైన ఉపాధి అవకాశాలను అందిస్తుంది. ఈ అధ్యయనానికి అవకాశం కల్పించే అరుదైన అంతర్జాతీయ కోర్సు... చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీఎఫ్ఏ)!
మదుపు మార్కెట్లు, పెట్టుబడుల రంగంలో నిష్ణాతుల అవసరం రోజురోజుకీ ఎక్కువవుతోంది. నాణ్యత కలిగిన మదుపు సలహాల కోసం, క్లయింట్ల పోర్ట్‌ఫోలియో నిర్వహణ కోసం ఎక్కువ మొత్తంలో చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌లకు అంతర్జాతీయంగా గిరాకీ ఉంటోంది. ఈ నేపథ్యం, ప్రపంచీకరణ ప్రభావం మూలంగా సీఎఫ్ఏ కోర్సుకు మనదేశంలో ఆదరణ పెరుగుతోంది.
ఫైనాన్స్ రంగం సంబంధిత ప్రత్యేక కోర్సుల్లో 30- 50% వృద్ధి ఈ సంవత్సరం నమోదైంది. సీఎఫ్ఏ కోర్సులో 2014-15లో క్రితం సంవత్సరంతో పోలిస్తే 38% వృద్ధి నమోదవగా గత 5 సంవత్సరాల వార్షిక వృద్ధి రేటు 1% మాత్రమే. సీఎఫ్ఏ కోర్సుపై పెట్టుబడుల రంగంలోని ఎగ్జిక్యూటివ్‌లు, బ్రోకరేజీ సంస్థల ఉద్యోగులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (కేపీవో) సంస్థల నుంచి కూడా గిరాకీ సీఎఫ్ఏ చార్టర్డ్‌కు లభిస్తోంది. ఎందుకంటే అవి అమెరికాలోని వాటి మాతృసంస్థలకు పనిచేస్తాయి కాబట్టి. సీఎఫ్ఏ చార్టర్డ్ కలిగిన ఉద్యోగుల వల్ల కేపీవోలకు ఆదరణ, గుర్తింపు, విశ్వసనీయత లభిస్తాయి.
సీఎఫ్ఏ సర్టిఫికేషన్‌కు మార్కెట్ల వృద్ధి కూడా తమిచ్చిందని చెప్పవచ్చు. 2014కు ముందు నిస్తేజంగా ఉన్న భారత మార్కెట్లు ఏడాదిన్నర కాలంగా పుంజుకున్నాయి. దీని మూలంగా అదనపు అర్హతలున్న ఫైనాన్స్ నిపుణులకు జీతభత్యాలు భారీగా వృద్ధి చెందాయి.
జూన్ 2015లో సీఎఫ్ఏ పరీక్ష రాసినవారు ప్రపంచవ్యాప్తంగా 1,25,443 మంది. వీరిలో భారత్ 10,65 1అభ్యర్థులతో మూడో స్థానంలో ఉంది. అమెరికా (30,715), చైనా (21,057) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆసియా- పసిఫిక్ ప్రాంతం 52,740 మంది అభ్యర్థులతో మొత్తం ప్రపంచంలో 42%తో అగ్రస్థానంలో ఉంది.
ఫైనాన్స్ రంగంలో సీఎఫ్ఏను ప్రామాణిక కోర్సుగా పరిగణిస్తారు. ఈ అదనపు అర్హతను అభ్యర్థులు సంపాదిస్తే అధిక వేతనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సీఎఫ్ఏ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఏ మార్కెట్లోనైనా ఉపయోగపడేవిధంగా అభ్యర్థులను తీర్చిదిద్దుతుంది. ఈ పరీక్షలు, చార్టర్డ్ను సీఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ (యూఎస్ఏ) అందిస్తుంది. ఆ సంస్థ లెక్క ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1,20,000 మందికి సీఎఫ్ఏ అర్హత ఉంది. సీఎఫ్ఏ చార్టర్డ్ ఒక అభ్యర్థి రెజ్యూమేకు ఎంతో విలువనిస్తుంది.
కోర్సు వివరాలు...
ఈ కోర్సులో చేరాలంటే... డిగ్రీ ఆఖరి సంవత్సరంలో కానీ లేదా ఇప్పటికే ఉత్తీర్ణులై ఉండాలి. 4 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవమున్నవారు కూడా అర్హులే. ఈ కోర్సును 3 దశల్లో నిర్వహిస్తారు. సీఎఫ్ఏ చార్టర్డ్ను పూర్తిచేయడానికి కనీస వ్యవధి 2 సంవత్సరాలు. విద్యార్థి సీఎఫ్ఏ చార్టర్డ్ పరీక్ష సన్నద్థతను డిగ్రీ చదువుతున్నపుడే మొదలుపెట్టవచ్చు.
అసెట్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు, మదుపు వ్యూహాలు, మదుపు విశ్లేషణ చేయగలిగిన అభ్యర్థుల గురించి ఆర్థిక సంస్థలు వెతుకుతుంటాయి. ఎంబీఏతో పోల్చినపుడు సీఎఫ్ఏను ఫైనాన్స్ రంగంలో కేంద్రీకృతమైన కోర్సుగా చెప్పవచ్చు.
లెవల్-1: ఈక్విటీలు, డెరివేటివ్‌ల గురించీ, పోర్ట్‌ఫోలియో తయారు చేయడం గురించీ ప్రశ్నలుంటాయి. ఈ దశను ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్లలో అందిస్తారు. లెవల్-1లో 240 బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి.
లెవల్-2: దీనిలో పోర్ట్‌ఫోలియో విశ్లేషణ, పరిమాణాత్మక విశ్లేషణ మీద ప్రశ్నలుంటాయి. ఈ భావనలు ఆస్తుల విలువ నిర్ధారణకు పునాదిరాళ్లుగా చెప్పవచ్చు. ఈ దశను జూన్‌లో మాత్రమే అందిస్తారు. 120 బహుళైచ్ఛిక ప్రశ్నలు (20 కేస్లెట్లు. ప్రతి కేస్లెట్కూ 6 ప్రశ్నలు) ఉంటాయి.
లెవల్-3: దీనిలో పరీక్ష పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ మీద కేంద్రీకృతమవుతుంది. ఎలాంటి వ్యూహాలు వ్యక్తులకూ, సంస్థలకూ అవసరమవుతాయో పరీక్షిస్తారు. వ్యాస రూపంలో, బహుళైచ్ఛిక రూపంలో ప్రశ్నలుంటాయి.
ఎలాంటి ఉద్యోగావకాశాలు?
అంతకుముందు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారైనా, తమ కెరియర్ను మార్చుకోవాలనుకునేవారైనా సీఎఫ్ఏ చార్టర్డ్ ద్వారా అనేక అవకాశాలు పొందవచ్చు. ప్రత్యేకంగా వారి ఉద్యోగావకాశాలను బట్టి పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, ప్రైవేటు బ్యాంకర్లు, ఫండ్ మేనేజర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు, రిలేషన్షిప్ మేనేజర్లు, ఫైనాన్షియల్ స్ట్రాటజిస్టులుగా సీఎఫ్‌ఏలు వివిధ పాత్రల్లో వ్యవహరిస్తారు. ఎంబీఏ, సీఏలు కూడా ఈ కోర్సు ద్వారా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఉద్యోగాల్లో చేరవచ్చు. సీఎఫ్ఏ చార్టర్డ్ వల్ల అభ్యర్థులు తమ జీతభత్యాలను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుంది.
మొదటిదశలో సీఎఫ్ఏ చార్టర్డ్ కలిగిన అభ్యర్థికి సుమారు 5 లక్షల రూపాయల వార్షిక జీతభత్యాలుంటాయి. 6-7 సంవత్సరాల అనుభవంతో వార్షిక జీతం రూ.12 లక్షల వరకు ఉంటుంది. పది సంవత్సరాల అనుభవంతో వార్షిక జీతం రూ. 19 లక్షల వరకు ఉంటుంది.
* మరిన్ని వివరాలకు www.cfainstitute.org చూడవచ్చు.
Comments