రంగులోనూ రూపంలోనూ చూడ్డానికి అచ్చం ఒకేలా ఉంటాయి. పేరులోనూ తేడా ఉన్నట్లు అనిపించదు. కానీ ఉంటుంది. చదివిన మన మెదడు కూడా మోసపోయేలా ఏదో ఒక అక్షరం అటూ ఇటూగా. అవును, మార్కెట్లో దొరికే ప్రముఖ బ్రాండ్ పేస్టులూ డిటర్జెంట్లూ క్రీములూ షాంపూలూ చిరుతిండ్లూ చాక్లెట్లూ... ఇలా బ్రాండెడ్ ఉత్పత్తుల పేరుతో వచ్చే నకిలీవి ఎన్నో.
కోల్గేట్ పేస్ట్... అందరికీ తెలిసిన పేరే. ఎంత చదువుకోని వాళ్లైనా దూరం నుంచి చూస్తే చాలు, ‘ఇది కోల్గేట్’ అని చెప్పేయగలరు. కానీ అచ్చం అదే రూపంతో అవే అక్షరాలను కాస్త అటూ ఇటూగా మార్చిన పేరుతో నకిలీ పేస్టులూ వస్తున్నాయి. చదవలేని వారి సంగతలా ఉంచితే విద్యావంతులు కూడా పరీక్షగా చూస్తేకానీ అది అసలైన కోల్గేట్ కాదని గమనించలేనంత పోలికతో ఉంటున్నాయవి. ఇదే కాదు, రోజూ మనం వాడే క్రీములూ సబ్బులూ డిటర్జెంట్లూ షాంపూల దగ్గర్నుంచి అగ్గిపెట్టెల వరకూ బ్యాటరీలూ బ్యాగుల దగ్గర్నుంచి బట్టలూ బూట్ల వరకూ పిల్లలు తినే చాక్లెట్ల దగ్గర్నుంచి చిప్స్ వరకూ ఎన్నెన్నో ఉత్పత్తులు పేరులోని అక్షరాలను తారుమారు చేసుకుని మనల్ని ఏమారుస్తున్నాయి. అవునుమరి, టైడ్ ప్రకటనలో అవాక్కయ్యారా... అన్నట్లూ దాని పేరులో ఒక్క అక్షరాన్ని మార్చి వచ్చే ‘టిడ్స్’ను చూస్తే ఎవరైనా అవాక్కవకుండా ఉంటారా... ఒలే షాంపూ ఓకే పేరుతోనూ, ఫెయిర్ అండ్ లవ్లీలా కనిపించే ఫోర్ అండ్ లవ్, హోమ్లైట్స్ అగ్గిపెట్టెలు హోమ్లైఫ్స్ పేరుతోనూ... ఇలా ఒకటా రెండా రోజువారీ వాడే ఉత్పత్తుల్లో నకిలీలకు అంతేలేదు. ఆఖరికి పిల్లలు తినే వాటినీ వదలడం లేదు. డెయిరీ మిల్క్ చాక్లెట్ కొని తీరా తినేముందు చూస్తే అది డే మిల్క్ కావొచ్చు. లేస్ అనుకుని కొని ‘రుచేంటి ఇలా ఉందని’ పొట్లం వైపు చూస్తే దానిమీద ‘వై’కు బదులు ‘జీ’ ఉండి ‘లెగ్స్’ అనే పేరు దర్శనమివ్వొచ్చు. పట్టణాలూ నగరాల్లో విద్యావంతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇలా అక్షరం మార్పుతో వచ్చే పేర్లను చాలావరకూ కనిపెట్టేయగలరు. అందుకే, ఈ పేరు మార్పులతో వచ్చే నకిలీ మార్కెట్ హవా ఎక్కువగా పల్లెటూళ్లలోనే సాగుతోంది. పట్టణాల విషయానికొస్తే పేరూ ప్యాకింగ్ కూడా ఒకేలా ఉండి మరీ పరీక్షగా చూస్తే కానీ కనిపెట్టలేనివిధంగా వస్తుంటాయి. అలాంటివాటిలో వేజలిన్ ఒకటి. ఆ పేరులో చివర ఉండే ఆంగ్ల అక్షరం ‘ఈ’ ఒక అక్షరం ముందుకొచ్చి నిజమైన వేజలిన్లా దర్శనమిచ్చి చదువుకున్న వాళ్లను కూడా భ్రమలో పడేస్తుంది. అందుకే, ఆమధ్య ఆ కంపెనీ ఓ ప్రత్యేకమైన ముద్రను చూపిస్తూ డబ్బా మీద అది ఉంటేనే నిజమైనదంటూ ప్రకటనల్ని ప్రసారం చేసింది. ఇలా చెప్పాలే కానీ మనదేశంలో ఏటా అమ్ముడయ్యేవాటిలో 15శాతం ఉత్పత్తులు నకిలీవే. వాటి విలువ సుమారు రూ.15వేల కోట్లు ఉంటుందనేది అంచనా.
దుకాణాలూ...
కేవలం ఉత్పత్తులే కాదండోయ్ ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ఏకంగా దుకాణాలను కూడా నిర్వహించేస్తున్నారు. అచ్చం అలాగే ఉండే లోగోలూ అక్షరాలతో కాస్త అటూ ఇటూగా అలాంటి పేర్లనే తమ షాపులకు పెట్టేస్తున్నారు. స్టార్ బక్స్ కాఫీ... సన్ బక్స్, పిజ్జా హట్... పిజ్జా హిట్, మైక్రోసాఫ్ట్ బింగోస్... మైఖేల్సాఫ్ట్ బింబోస్ ఆ తరహావే. ఇలాంటివి భారత్‌లోనూ చైనాలోనే ఎక్కువట. చూశారా... మోసం చెయ్యడానికి ఎంత సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారో!
మూలం:- ఈనాడు ఆదివారం పుస్తకం
Comments